chandrababu Naidu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..!

chandrababu Naidu : సీతానగరం ఘాట్‌లో యువతిపై అత్యాచారం ఘటనపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.. యువతిపై అత్యాచార ఘటన అమానుషమన్నారు.

Update: 2021-06-21 13:45 GMT

chandrababu Naidu : సీతానగరం ఘాట్‌లో యువతిపై అత్యాచారం ఘటనపై డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.. యువతిపై అత్యాచార ఘటన అమానుషమన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి 2 కిలోమీటర్లు, డీజీపీ, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఘటన జరగడాన్ని చంద్రబాబు కోట్‌ చేస్తూ లేఖ రాశారు. మహిళలను రక్షించలేని చట్టాలు, యాప్‌ల వల్ల ఉపయోగమేంటిని ప్రశ్నించారు చంద్రబాబు. ఇప్పుడున్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చన్నారు.

అత్యాచార ఘటన జరిగి ఇన్ని గంటలు గడిచినా ఎలాంటి చర్యలు లేవన్నారు. సీతానగరం ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ అవుట్‌ పోస్టు శిథిలావస్థలో ఉండటం బాధాకరమన్నారు. డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసాలకు సమీపంలో మాదక ద్రవ్యాల అమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ఫిర్యాదులు ఉన్నా ఎలాంటి చర్యలు లేవన్నారు చంద్రబాబు. ప్రజల్లో విశ్వాసం పెంచేలా కృష్ణా నది ఒడ్డున పోలీసు గస్తీ పెంచడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని, నేరస్థులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగడం విచారకరమన్నారు చంద్రబాబు. దిశ చట్టం కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేశారు.. 24 గంటల్లో ఎన్నిటిపై చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ఆర్భాటం చేసిన దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ మొబైల్‌ వాహనాలు, ప్రత్యేక యాప్‌లు అన్నీ మోసపూరితంగా మారాయన్నారు. వైసీపీ రంగులను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి మాత్రమే దిశ చట్టం పనికొచ్చనట్లుందంటూ లేఖలో ఘాటుగానే విమర్శించారు. రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేంటో ప్రజలకు వెల్లడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News