ap: కేంద్రంలో కూడా బాబే కీలకం

బిహార్‌లో నితీష్ కుమార్;

Update: 2024-06-05 01:30 GMT

కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జేడీయూ అగ్రనేత నీతీశ్‌కుమార్‌లు కీలకం కానున్నారు. భాజపా ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతి పెద్ద పార్టీలైన తెదేపా, జేడీయూలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌కు మేలుచేసే అవకాశం ఉంది.

చంద్రబాబు, నీతీశ్‌లు గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. బిహార్‌లో భాజపాది పెద్దన్న పాత్ర అయితే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఆ స్థానంలో ఉంది. అయినప్పటికీ పరస్పర అవగాహనతో ఆయాపార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటుచేసుకొని ఎన్నికల గోదాలో దిగాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, భాజపా రెండూ లాభపడగా, బిహార్‌లోనూ అదే పరిస్థితి. ప్రస్తుతం ఎన్డీయేలో భాజపా తర్వాత అతి పెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూలు నిలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు అవసరం. ఈ రాజకీయబలాన్ని ఉపయోగించుకొని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వపరంగా మేలు చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.

మోదీ ప్రభుత్వంలో అశోక్‌గజపతిరాజు పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్నప్పుడే భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. కర్నూలు ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయింది. విజయవాడ ఎయిర్‌పోర్టు, తిరుపతి ఎయిర్‌పోర్టుల విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆర్‌సీఎస్‌ ఉడాన్‌ పథకం కింద కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మరోవైపు సుజనాచౌదరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ విభజన చట్టంలో చెప్పిన కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటు, నిధుల విడుదల తదితర వ్యవహారాలు చూశారు. ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండటంతో అమరావతి, గుంటూరు, విజయవాడల అభివృద్ధికి కేంద్రపట్టణాభివృద్ధిశాఖ ద్వారా సుమారు 2 వేల 500 కోట్లు విడుదల చేశారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలను స్మార్ట్‌సిటీలుగా ప్రకటించి నిధులు విడుదల చేయించారు. ఒక్క ప్రత్యేక హోదా అంశం మినహాయిస్తే మిగిలిన పనులు 2014-18 మధ్యకాలంలో కొంత వేగంగానే సాగాయి. కానీ గత అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకంటే ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో కొత్త ప్రాజెక్టులేవీ రాలేదు. ఇప్పుడు చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఆలంబనగా చేసుకొని ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడంతోపాటు, కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 

  

Tags:    

Similar News