ఆరుద్ర విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలం: చంద్రబాబు
న్యాయం చేయమన్నందుకు పిచ్చాసుపత్రికి తరలిస్తారా అని ప్రశ్నించారు;
వైసీపీ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు. కాకినాడకు చెందిన ఆరుద్ర విషయంలో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆరుద్ర విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక బాధిత మహిళ కష్టం తీర్చలేని విధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు తయారయ్యాయని ప్రశ్నించారు. బాధిత మహిళ పోరాటానికి స్పందించకపోవడమే మానవీయతా అంటూ సీఎం జగన్‌ను నిలదీశారు. ఆరుద్ర అంశంపై సీఎంను ప్రశ్నిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
బిడ్డ వైద్యం కోసం ఆ తల్లి చేస్తున్న పోరాటాన్ని వైసీపీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. జగన్ పెట్టిన ఆరోగ్య శ్రీ ఏమయ్యిందో చెప్పాలన్నారు. న్యాయం కోరుతూ ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బాధితురాలు ఆత్మహత్యకు యత్నించిందని గుర్తు చేశారు. ఏడాది కాలంగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక
ప్రశ్నించిన మహిళకు మానసిక పరిస్థితి సరిగా లేదనడంపై మండిపడ్డారు చంద్రబాబు. న్యాయం చేయమన్నందుకు పిచ్చాసుపత్రికి తరలిస్తారా అని ప్రశ్నించారు. అసలు ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లడానికి కారణం ఎవరని.. చివరికి ఏం చేయబోతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికైనా వెంటనే ఆరుద్ర సమస్యను పరిష్కరించాలని.. ఆమె కుటుంబానికి తగిన సాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.