CHANDRABABU: ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతున్నాం
పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ;
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఆ వివరాలు పంచుకున్నారు. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని... అందుకు అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. తొలుత కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఆర్ పాటిల్‌తో సీఎం భేటీ అయ్యారు.
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘ పోలవరంపై సీఆర్ పాటిల్‌తో చర్చించాం. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తికి ప్రయత్నాలు చేస్తున్నాం. డయాఫ్రమ్ వాల్‌ను వైసీపీ ప్రభుత్వం నీళ్లలో కలిపేసింది. నాణ్యతలో రాజీపడకుండా పోలవరం నిర్మిస్తాం. బనకచర్ల ప్రాజెక్ట్‌తో ఎవరికీ అభ్యంతరం ఉండదు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు రూ. 80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బనకచర్ల ప్రాజెక్ట్ ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది. సముద్రంలోకి వెళ్లే నీళ్లనే బనకచర్లకు మళ్లిస్తాం’ అని అన్నారు.
విభజన చట్టంలో అమరావతి
అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 గురించి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తామన్నారు. ఏపీలో సైనిక కంటోన్మెంట్ పెట్టాలని కోరామన్నారు. సంపద సృష్టించాలంటే కొత్త విధానాలు తీసుకురావాలన్నారు. ఆర్థిక సాయం మాత్రమే కాదు.. అనుకూలమైన ప్రతిపాదనలు కూడా కావాలని అడిగినట్లు తెలిపారు.
కేంద్రం అనుమతివ్వగానే పోలవరం-బనకచర్ల పనులు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం. కేంద్రం అనుమతి ఇవ్వగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం." అని చంద్రబాబు తెలిపారు.