CBN: ఇక మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్: చంద్రబాబు
కఠిన చర్యలకు సిద్ధమైన తెలుగుదేశం అధినేత
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య నెలకొన్న వివాదం, ఒకరి మీద మరొకరు బహిరంగ విమర్శలు చేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూఏఈ పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ ఇద్దరు నేతలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడతానని చంద్రబాబుకు పల్లా శ్రీనివాసరావు వివరించగా.. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక పార్టీలో వివాదాలు, నేతల వ్యవహారశైలిపై తానే దృష్టిపెడతానని స్పష్టం చేశారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇక పిలవడాలు, బతిమాలడాలు లేవన్న చంద్రబాబు... పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా డీల్ చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో పాజిటివ్నెస్ దెబ్బతీసేలా, క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించేవారిని ఉపేక్షించేదే లేదని చంద్రబాబు హెచ్చరించారు.
"ఎమ్మెల్యే టికెట్ కోసం చిన్నికి రూ. 5 కోట్లు ఇచ్చా"
ఏపీలో కూటమి నాయకుల మధ్య వివాదాలు సంచలనం రేపుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ. 5 కోట్లు తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబందించిన ఆధారాలు కూడా బయటపెట్టారు కొలికపూడి. రూ. 5 కోట్లు తీసుకొని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారని అన్నారు కొలికపూడి. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ ఫర్ చేశారన్నది వెల్లడించారు. 2024 ఫిబ్రవరి 7న రూ. 20 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశానని.. ఫిబ్రవరి 8న మరో రూ. 20 లక్షలు, ఫిబ్రవరి 14న మరో రూ. 20 లక్షలు బదిలీ చేశానని అన్నారు. చిన్ని పీఏ మోహన్ కు రూ. 50 లక్షలు, గొల్లపూడిలోని తన ఫ్రెండ్స్ ద్వారా మిగతా రూ. మూడున్నర కోట్లు ఇచ్చానని అన్నారు కొలికపూడి శ్రీనివాస్. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ శుక్రవారం వెల్లడిస్తానని అన్నారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ కొలికపూడి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
దెయ్యం ఎందుకయ్యానో?: చిన్ని
ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. వివాదం అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని, వాళ్లు చూసుకుంటారని చెప్పారు. తిరువూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ మొన్నటి వరకు కొలికపూడి నన్ను దేవుడు అన్నారు. ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే సమాధానం చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్, పవన్ను విమర్శించే వారిని శత్రువుల్లాగే చూస్తా. నేను వైకాపా నేతలతో అంటకాగే నాయకుడిని కాదు. తిరువూరులో నాలుగేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా’’ అని అన్నారు. తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడని.. తనపై విమర్శలు చేసినవాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలని అన్నారు. తాను డబ్బులు సంపాదించుకోవాలంటే.. తిరువూరు వరకు రావాల్సిన అవసరం లేదన్నారు.