CM Chandrababu Naidu : హామీ నెరవేర్చిన చంద్రబాబు.. గూడూరు ప్రజల థాంక్స్
గూడూరు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. తాజాగా జిల్లాల్లో చేసిన మార్పుల్లో గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపారు. అటు తిరుపతి అవసరాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కూడా కీలక చర్చలు జరిపారు. గూడూరు నియోజకవర్గాన్ని గతంలో వైసీపీ తిరుపతి జిల్లాలో కలిపింది. అసలు ప్రజల వాదనలు వినిపించుకోకుండా.. ఇష్టం వచ్చినట్టు జిల్లాలను ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. రెవెన్యూ అవసరాలు, ప్రజల అవస్థలను కనీసం పట్టించుకోలేదు అప్పటి సీఎం జగన్. దీంతో గూడూరు ప్రజలు అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. గూడూరును కచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి.
ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కీలక హామీ ఇచ్చారు. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలుపుతామన్నారు. ఇచ్చినట్టుగానే ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో గూడూరుతో పాటు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను కూడా నెల్లూరులోనే కలిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ గూడూరును నెల్లూరులోనే కలపాలని ఏకంగా 950కి పైగా వినతులు వచ్చాయి. దీంతో ప్రజల అభిప్రాయాలను సేకరించారు అధికారులు. నెల రోజులుగా ప్రజల అభిప్రాయాలు తీసుకున్న ప్రభుత్వం గూడూరును తిరిగి నెల్లూరులోనే కలిపేసింది.
అంతే కాకుండా తిరుపతి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని దాన్ని గ్రేటర్ తిరుపతిగా మార్చే ప్రణాళికను కూడా రెడీ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇలా అన్ని జిల్లాలకు సమన్యాయం జరిగేలా తాజాగా నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గూడూరుతో పాటు మిగతా జిల్లాల ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడుకు థాంక్స్ చెబుతున్నారు.