CBN: పేదల పెన్నిధి ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన టీడీపీ శ్రేణులు

Update: 2026-01-18 03:30 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్థంతిసందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌ కూడా ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి తన తాతను స్మరించుకున్నారు. లోకేష్ వెంట పలువురు తెలంగాణ టీడీపీ నేతలు సైతం ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ కుమారుడు, నటుడు కళ్యాణ్ రామ్ తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజాజీవితంలో చేసిన సేవలు, రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులను అభిమానులు స్మరించుకున్నారు.

ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఘన నివాళి

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన్ను స్మరించుకున్నారు. ఎక్స్ వేదికగా ఘన నివాళిని అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కారణజన్ములని, యుగ పురుషులని, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన నారా లోకేశ్‌

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 30వ వర్థంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని ఆయన సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. లోకేశ్‌తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు సినీనటుడు కల్యాణ్‌రామ్‌ చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘాట్‌ను పూలతో తీర్చిదిద్దారు.

Tags:    

Similar News