CM Chandrababu: 2027 జూన్ నాటికి పోలవరం పూర్తిచేయాలి
కేంద్రం చెప్పిన లక్ష్యాలను చేరుకోవాల్సిందే;
‘పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాల్సిందే. కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. వారు పేర్కొన్న గడువులోపు ప్రాజెక్టు పూర్తిచేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఒకవేళ ప్రాజెక్టు డ్యాం పూర్తి ఎత్తు నిర్మాణం ఆలస్యమైతే దశలవారీగా ఎత్తుకు తగ్గట్టు 30 లేదా 40శాతం నీళ్లయినా నిలబెట్టేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. ‘విదేశీ నిపుణుల బృందం, కేంద్ర జలసంఘం నిపుణులు పోలవరం వస్తున్నందున ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలుపై పూర్తి స్పష్టతకు రావాలి. డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం సమాంతరంగా నిర్మించేందుకు ఉన్న అవకాశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలి’ అని అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలు ఖరారు చేసేందుకు అధికారులు, గుత్తేదారు ఏజెన్సీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. నవంబరు 22, 23 తేదీల్లో తాను పోలవరం వస్తానని, ఆ రోజు ప్రాజెక్టు ఎప్పటికి, ఎలా పూర్తిచేసేదీ ప్రజలకు వెల్లడించాల్సి ఉందని ఆయన ఆకాంక్షించారు. పోలవరంలో మేధోమథనం పూర్తయిన తర్వాత పది రోజుల్లో తనకు పూర్తి షెడ్యూలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 2026 మార్చి నాటికి డయాఫ్రం వాల్ పూర్తవుతుందని నిర్మాణ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణ పనులు ప్రారంభిస్తే 2028 మార్చికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలమన్నారు. ఒకవేళ డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం సమాంతరంగా నిర్మిస్తే 2027 నాటికే నిర్మాణం పూర్తవుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. మేఘా కృష్ణారెడ్డి, సుబ్బయ్య, బావర్ కంపెనీ నుంచి హసన్, మ్యాథ్స్ సమావేశంలో పాల్గొన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి 15 నెలలు పడుతుందని బావర్ ప్రతినిధులు పేర్కొనగా తగ్గించేందుకు ప్రయత్నిస్తామని మేఘా ప్రతినిధులు హామీ ఇచ్చారు.