Konaseema District : హైటెన్షన్ వైర్లపై కొబ్బరిచెట్టు పడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం, చినకొత్తలంక గ్రామంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లపై కొబ్బరిచెట్టు కూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..
సుదీర్ఘ సమయం పాటు విద్యుత్ లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ సమస్యపై విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమకు అందుబాటులో ఉండడం లేదంటూ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని ప్రధాన విద్యుత్ మార్గంలో ఉన్న ఒక పెద్ద కొబ్బరిచెట్టు హైటెన్షన్ వైర్లపై పడిపోయింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొదట చిన్నపాటి అంతరాయంగా భావించినా, గంటలు గడుస్తున్నా విద్యుత్ పునరుద్ధరణ కాకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు...
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామంలోని నివాసాలకు, వాణిజ్య సంస్థలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రిపూట చీకటిలో గడపాల్సి రావడం, వేసవి కావడంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీటి సరఫరాకు కూడా ఆటంకం ఏర్పడిందని, మోటార్లు పనిచేయకపోవడంతో మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు...
చినకొత్తలంక గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. "వేరే గ్రామానికి కేటాయించిన లైన్ మెన్ ఇన్ఛార్జ్ గా తమ గ్రామానికి కూడా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల మా గ్రామంలో సమస్యలు తలెత్తినప్పుడు సకాలంలో స్పందించడం లేదు. ఆయన అందుబాటులో ఉండకపోవడంతో మా గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు" అని ఒక గ్రామ పెద్ద ఆవేదన వ్యక్తం చేశారు...
గతం నుండీ కూడా అనేకసార్లు విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు ఇదే పరిస్థితి ఎదురైందని, ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు...
చెట్లు, కొమ్మలు వైర్లకు తగిలి తరచుగా విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నా, వాటిని తొలగించడంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు రావు కదా" అని మరో గ్రామస్థుడు ప్రశ్నించారు. తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, తమ గ్రామానికి పూర్తిస్థాయి లైన్ మెన్ ను కేటాయించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు...
తమ గ్రామానికి విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించకపోతే సబ్ స్టేషను ఎదుట ఆందోళన చేస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.