congress: జగన్.. ఓ అవినీతి శాస్త్రవేత్త: మాణికం ఠాగూర్
జగన్ కోటి కుటుంబాలను నాశనం చేశారని విమర్శలు;
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఓ అవినీతి శాస్త్రవేత్త అని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో ఒక కోటి పేద కుటుంబాలను నాశనం చేసిందని ఆరోపించారు. మద్యం ముడుపుల కేసులో రూ.11 కోట్లు దొరకటంపై ఆయన స్పందించారు. ‘‘తొలి విడతలో రూ.11 కోట్ల మద్యం ముడుపులు పట్టుబడ్డాయి. జగన్ చేసిన దోపిడీ నగదు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. మొత్తం రూ. 3,500 కోట్ల స్కామ్ జరిగింది. మద్యం ముడుపులతోనే సినిమాలు, ఆస్పత్రులు నిర్మించారు. ఆ డబ్బుతోనే షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగింది. జగన్ పరిపాలన చేయలేదు.. అవినీతి ముఠాను నడిపారు. ’’అని విమర్శలు గుప్పించారు.
జగన్ ది జైళ్ల యాత్ర: హోంమంత్రి అనిత
జైళ్ల యాత్ర పేరుతో మాజీ సీఎం జగన్ విచిత్ర వేషాలు వేస్తున్నారని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. మహిళలను ఎవరైనా కించపరిస్తే వారిని ప్రోత్సహిస్తామనే జగన్ ధోరణి సీఎంగా ఉన్నప్పుడు మారలేదని.. ఇప్పుడూ పోలేదని విమర్శించారు. చెల్లి వరుసయ్యే మహిళా నేతపై వ్యక్తిత్వ హననం చేసిన వారికి జగన్ మద్దతు పలకటాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ‘‘వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలను కోర్టులు తప్పుపట్టాయి. సభ్య సమాజం ఛీకొడుతుంటే జగన్ ఒక్కరే వారికి మద్దతిస్తున్నారు. రాజకీయంగా ప్రశాంతిరెడ్డిని ఎదుర్కోలేక చవకబారు వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్‌రెడ్డికి జగన్ పరామర్శ సిగ్గుచేటు. ఆస్తి పంపకాల విషయంలో తల్లీచెల్లిపై కోర్టులో గెలిచానని వీరంగం చేసే వ్యక్తిని జగన్లోనే చూశా. జగన్ చేసేది పరామర్శలా? బల ప్రదర్శనలా? పరామర్శల పేరుతో బలప్రదర్శనలు చేస్తే పోలీసులు అనుమతులు ఇవ్వాలా?" అని హోంమంత్రి ప్రశ్నించారు. విశ్వసనీయత, పత్రికా విలువల గురించి గొప్పగా లెక్చర్లు ఇచ్చిన భారతీరెడ్డి ఈ ఫేక్ వీడియోలపై ఏం సమాధానం చెప్తారు?’’ అని మంత్రి అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడినా జగన్ తీరు మారలేదన్నారు.