CONGRESS: విజయభేరి సభకు సన్నాహాలు ముమ్మరం

ఈనెల 17న తెలంగాణ కాంగ్రెస్‌ సభ.... కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి

Update: 2023-09-14 04:30 GMT

హైదరాబాద్‌ తుక్కుగూడ వేదికగా ఈనెల 17 నిర్వహించే విజయభేరి సభకు తెలంగాణ కాంగ్రెస్‌ సన్నాహాలను ముమ్మరం చేసింది. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేతలు విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. హనుమకొండలో విజయభేరీ సన్నాహక సమావేశంలో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని KCR, KTR తాకట్టుపెట్టారని ఆరోపించారు. తుక్కుగూడ సభకు రాచకొండ పోలీసులు అనుమతించారు. పార్టీ పేరులో తెలంగాణ లేకుండా చేసిన KCRకు తెలంగాణ ప్రజలతో ఏం సంబంధమని PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్‌కే KVP రామచంద్రరావు బంధువు తప్ప తనకు కాదన్నది కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. సమైక్య వాదం వినిపించిన ఏపీ సీఎం జగన్‌కి ప్రగతి భవన్‌లో పరమాన్నం పెట్టింది ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తానని స్పష్టం చేశారు. హనుమకొండలో నిర్వహించిన విజయభేరి సభ సన్నాహక సమాశంలో ఆయన పాల్గొన్నారు. ఈనెల 17న తుక్కుగూడకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ సకుటుంబంగా రాష్ట్రానికి వచ్చి సభ నిర్వహిస్తుంటే దానిని అడ్డుకునేందుకు కేసీఆర్, మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆక్షేపించారు.

హైదరాబాద్ శివారులో తుక్కుగూడ వద్ద ఈనెల17న జరగనున్న విజయభేరి సభ ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. సభ నిర్వహణకు జరుగుతున్న పనులను చూసి నేతలకు పలు సూచనలు చేశారు. వంద ఎకరాలకు పైగా ఖాళీ స్థలాన్ని చదును చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. సభా వేదికతోపాటు మరో రెండు స్టేజీలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఖమ్మం సభను దృష్టిలో పెట్టుకొని భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రతా కారణాల రీత్యా మూడు స్టేజీల పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరని నేతలు తెలిపారు. ఈనెల 17న తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరి సభకు రాచకొండ పోలీసులు అనుమతి ఇచ్చారు. 

Tags:    

Similar News