ఏపీలో కరోనా డేంజర్ బెల్స్..
ఉత్తరాదిని వణికిస్తోన్న ఈ వైరస్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రతాపం చూపుతోంది.;
కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఉత్తరాదిని వణికిస్తోన్న ఈ వైరస్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రతాపం చూపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనాతో ఒకరు మృతి చెందారు.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 92 వేల 5 వందల 22 కి చేరింది. కరోనా బారినపడి ఇప్పటి వరకు 7,186 మృతి చెందారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా 69 కరోనా కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.
అటు పాఠశాలల్లో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు భయటపడుతుండటం సంచలనం కలిగిస్తోంది. పిల్లల్ని స్కూళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా వైరస్ బారిన పడటంతో పలుచోట్ల పాఠశాలలను మూసివేస్తున్నారు.
కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడంతో పాటు శరీరంలో ఏ మాత్రం అలసట, నలతగా ఉన్న కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.