అమ్మఒడి నిధుల విడుదలపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం..

2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో సంక్రాంతి పండగ సమయంలో ఖాతాల్లో వేశారు. 2021-22 విద్యా సంవత్సరంలో 2022 జనవరిలో ఇవ్వాల్సిన నగదును ఒకేసారి జూన్‌కు వాయిదా వేశారు.

Update: 2023-06-08 10:00 GMT

జగన్‌ సర్కార్‌ తీరు చెప్పిందొకటి..చేసేదొకటన్నట్లు ఉంది. అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయడంలో ప్రతి సంవత్సరం వాయిదా వేస్తుంది. ఆకడమిక్‌ ఇయర్‌ ప్రారంభంలో నిధులు విడుదల చేస్తే విద్యార్ధులకు ప్రయోజనం ఉంటుంది.. కానీ ఈ పథకానికి సర్కారు నీరుకారుస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లు విద్యా సంవత్సరం సగం గడిచాక అమ్మఒడి నిధులు విడుదల చేసింది. గతేడాది జనవరిలో విడుదల కావాల్సిన నిధులను జూన్‌లో విడుదల చేసింది. ఇక ఈ ఏడాది బడులు తెరిచే ముందు కాదంటూ మళ్లీ దాదాపు మూడు వారాలు వాయిదా వేసింది. ఈ నెల 12న బడులు ప్రారంభమవుతుండగా, 28న అమ్మఒడి నగదు విడుదల చేస్తామంటూ కొత్త తేదీ ప్రకటించింది.

ఇక పిల్లల్ని సూళ్లకు పంపించే తల్లులకు భరోసా కల్పిస్తామంటూ అమ్మఒడి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా జూన్‌లో బడులు తెరుస్తారు. పిల్లల కోసమే నగదు ఇస్తే బడులు తెరిచే ముందు నగదు విడుదల చేయాలి. కానీ 2019-20, 2020-21 విద్యా సంవత్సరాల్లో సంక్రాంతి పండగ సమయంలో ఖాతాల్లో వేశారు. 2021-22 విద్యా సంవత్సరంలో 2022 జనవరిలో ఇవ్వాల్సిన నగదును ఒకేసారి జూన్‌కు వాయిదా వేశారు. దీంతో రెండు, మూడు విడతల మధ్య ఏడాదిన్నర గ్యాప్‌ వచ్చింది.ఈ ఏడాది ఎప్పటిలాగే జూన్‌ 12న బడులు తెరుస్తుండగా కనీసం ఒకవారం ముందు అంటే.. ఈ నెల మొదటి వారంలో నగదు ఇవ్వాలి. అయితే ఈ నెల చివరిలో నగదు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అమ్మఒడి నగదుతో పిల్లల్ని ప్రైవేటుబడులకు పంపేవారిపై ప్రభావం పడనుంది.

మరోవైపు అమ్మఒడి నిధులను ఏటా సరైన సమయానికి విడుదల చేయకపోగా, నగదులోనూ కోత పెడుతున్నారు. ప్రతి తల్లికి ఏడాదికి 15 వేలు ఇస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది చెప్పినట్టే 15 వేలు వేసింది. రెండో ఏడాది టాయిలెట్ల నిర్వహణ ఖర్చు పేరుతో వేయి రూపాయలు వెనక్కి తీసుకుంది. మూడో ఏడాది స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ అంటూ మరో వేయి కోత పెట్టింది. దీంతో గతేడాది నుంచి తల్లులకు అందుతోంది 13 వేలు మాత్రమే. ప్రభుత్వం విధించే కోతలు ప్రభుత్వ సూళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకూ 2 వేలు కోత పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్లు, భవనాల నిర్వహణకు నిధులు ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.. అయినా ప్రైవేటు స్కూల్‌ విద్యార్ధులకు కూడా కోత ఎందుకు పెడుతున్నారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News