PAWAN: నాకు ఓట్ల కంటే ధర్మమే ముఖ్యం
ధర్మ రక్షణ చేయలేనప్పుడు ఎన్ని పదవులు ఇచ్చినా నిష్ప్రయోజనం... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్;
తనకు ఓట్లు, రాజకీయాల పదవుల కంటే సనాతన ధర్మం పరిరక్షణే ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ధర్మం గొప్పతనం పాఠ్యాంశాల్లో లేదని... సనాతన ధర్మాన్ని పాటించిన పాలకుల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. తాను ఇటీవల మదుర మీనాక్షి ఆలయానికి వెళ్లగా... అమ్మవారి మూల విగ్రహాన్ని ఎలా దాచిపెట్టారో అక్కడి పూజారులు వివరించారని గుర్తు చేశారు. అన్ని మతాలు సమానమని చెప్పిన హిందూ ధర్మాన్ని చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయంలో తనకు ఇబ్బంది అనిపించిందని వెల్లడించారు. తాను మంకుపట్టు పట్టే హిందువుని కాను. కానీ, అన్ని మతాలు బాగుండాలని చెప్పే నా ధర్మంపై దాడి చేస్తున్నప్పుడు.. ఓట్లు వస్తాయా? పోతాయా? అనేది తనకు తెలియదన్నారు. ఏ దేవుడైతే ఉనికి ఇచ్చాడో.. ఏ పరమాత్మ స్థానం ఇచ్చాడో.. ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులొచ్చినా నిష్ప్రయోజనమని పవన్ అన్నారు. మరోవైపు రాజకీయంగా.. ఇతర మతాలపై దాడి జరుగుతుంటే వెనకేసుకొస్తామని తెలిపారు. హిందూ ధర్మంపై దాడి జరుతుంటే ఒక్కరూ మాట్లాడరు. ఎందుకంటే ఓట్లు పోతాయనని. దీనిపై లోతుగా చర్చ జరగాలన్నారు.
కీలక బాధ్యతలు అప్పగింత
మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అందులోభాగంగా ఈ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. అందుకోసం.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆయన నియామించారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, పీ.ఓ.సీలు, మండలాధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి.. పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేలా కీలక బాధ్యతలు అప్పగించారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
పిఠాపురం నియోజకవర్గంలో విశాలమైన ప్రాంగణం కోసం అన్వేషించారు. చివరకు పిఠాపురంలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. ఇప్పటికే ఈ ప్రాంగణాన్ని చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడే సభా వేదిక, సభా ప్రాంగణంతోపాటు భోజనాలు, ఇతరత్రా ఏర్పాట్లు ఇలా అన్ని విధాలుగా సరిపడే విధంగా ఈ ప్రాంగణం వద్ద చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున భారీగా వాహనాలు వస్తాయని.. వాహనాల పార్కింగ్ కోసం అందుకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.