ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ). వైద్య ఆరోగ్య శాఖ, ఆస్పత్రుల పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందనీ.. సామాన్యుడు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగ్గ వైద్యం అందాలని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.
కార్పొరేట్ ఆస్పత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభం లేకుండా కేవలం సేవ చేస్తున్నప్పుడు ఎందుకు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నాం అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీపడాలని, ఇది సవాల్ గా తీసుకొని అధికార యంత్రాంగం పనిచేయాలని చెప్పారు.
"గత ప్రభుత్వం నిలిపేసిన ఆదరణ పనిముట్లు సత్వరమే పంపిణీ చేయాలి. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వెంటనే లబ్ధిదారులకు అందించాలి. సాధ్యమైనంత త్వరగా ఆ బీసీ భవనాలు పూర్తి చేయాలి. గౌడ, ఈడిగ సామాజిక వర్గం వారు కల్లు విక్రయిస్తారు. అందుకే వారికి 15 నుండి 20 శాతం వరకు దేశం షాపులు కేటాయించగలిగితే ఆర్థికంగా బలపడతారు. రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించాలి. గత ప్రభుత్వం లాగా గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని మళ్లీ తీసుకురాకూడదు. ఎక్కడ పండించిన ధాన్యం అక్కడే దగ్గర్లోని రైస్ మిల్ కు తీసుకెళ్లే వెసులుబాటు రైతుకు కల్పించాలి" అని చంద్రబాబు చెప్పారు.