Traffic Police :గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు సమయానికి స్పందించి ఒక ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన రామవరప్పాడు రింగ్ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఆర్ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ వీరాస్వామి, 30 మంది విద్యార్థులతో గన్నవరం నుంచి గుణదలకు బయలుదేరారు. మార్గమధ్యలో రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద డ్రైవర్‌కు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన స్పృహ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఆగిపోయింది.
అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న నాలుగో పట్టణ ట్రాఫిక్ సీఐ రమేశ్‌కుమార్, ఎస్సై రాజేశ్ వెంటనే పరిస్థితిని గమనించి స్పందించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరాస్వామికి వారు సీపీఆర్ చేశారు. వారి సకాలంలో చేసిన ప్రథమ చికిత్సతో వీరాస్వామి పరిస్థితి కొద్దిగా కుదుటపడింది. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల చొరవ వల్ల వీరాస్వామి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనలో పెద్ద ప్రమాదం తప్పడంతో బస్సులోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు చూపిన మానవత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.