బిగ్ బ్రేకింగ్.. సీఎం జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు
సరిగ్గా ఈడీ కోర్టు రమ్మన్న రోజే.. నెల్లూరులో అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభానికి సీఎం జగన్ వెళ్లాల్సి ఉంది.;
ఏపీ సీఎం జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు జారీచేసింది. సోమవారం నాడు అంటే ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు పంపింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్.. ఈ మధ్యే నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
సీఎం జగన్‌కు వారం రోజుల క్రితమే ఈడీ నుంచి సమన్లు జారీ అయ్యాయి. సరిగ్గా ఈడీ కోర్టు రమ్మన్న రోజే.. నెల్లూరులో అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభానికి సీఎం జగన్ వెళ్లాల్సి ఉంది. ఈడీ కోర్టు నుంచి సమన్లు వచ్చిన కారణంగానే.. నెల్లూరులో అమ్మ ఒడి ప్రారంభ కార్యక్రమాన్ని షెడ్యూల్‌లో చేర్చినట్టు ప్రచారం జరుగుతోంది. 11వ తేదీ నాడు ఉదయం 9:45కి తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11:10కి నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరులోని వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ సభకు హాజరవుతారు. తిరిగి మధ్యాహ్నం ఒకటిన్నరకు బయల్దేరి తాడేపల్లి చేరుకుంటారు. అదే రోజు హైదరాబాద్‌లోని ఈడీ కోర్టుకు కూడా సీఎం జగన్ రావాల్సి ఉంది.
తాను కోర్టుకు హాజరుకాలేనంటూ గతంలో జగన్ వేసిన పిటిషన్‌ను ఈడీ కోర్టు కొట్టేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. తన తరపున మరొకరు హాజరు అవుతారని పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ.. న్యాయస్థానం అంగీకరించలేదు. జగన్ విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆస్తుల కేసు విచారణలో జగన్ వచ్చే సోమవారం న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో జగన్ ఇదే విధంగా సీబీఐ కోర్టును కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. కానీ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.
గతేడాది జనవరి 10న జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ జగన్ కేసు విచారణకు హాజరు కావడం అదే తొలిసారి. ఆ తరువాత జనవరి 17, 24 తేదీల్లో జరిగిన విచారణకు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. జనవరి 24న జరిగిన విచారణకు విజయసాయి రెడ్డితోపాటు ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామ్యూల్ హాజరయ్యారు.
సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణను చేపట్టరాదని జగన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు కొట్టేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సీబీఐ తరపు న్యాయవాది గతంలో వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. జగన్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.