SHESHACHALAM: శేషాచలం అడవుల్లో ఏనుగులకూ భద్రత లేనట్టేనా?
శేషాచలం అడవుల్లో అక్రమ రవాణ,. దంతాల స్మగ్లింగ్‌పై కలకలం;
శేషాచలం అడవుల్లో మరోసారి అక్రమ రవాణా మాఫియాల కల్లోలం వెలుగులోకి వచ్చింది. ఈసారి ఎర్రచందనం కాకుండా ఏనుగు దంతాల స్మగ్లింగ్! ఇటీవల హైదరాబాదులో రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్న ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, ఆ దంతాల మూలాలు శేషాచలంలోనే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారుల్లో కలవరం మొదలైంది.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?
ఇన్నాళ్లు ఎర్రచందనం రక్షణకే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న అధికారులు, వన్యప్రాణులపై మాత్రం తగిన శ్రద్ధ తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వృత్తిపరంగా అడవిలోకి వచ్చే స్మగ్లర్లు, ఇప్పుడు ఏనుగుల ప్రాణాలను కోసే స్థాయికి చేరుకున్నారన్నది ఈ ఘటనతో మరోసారి రుజువైంది. అటవీశాఖ అధికారులు డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, మోషన్ డిటెక్టర్లు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడవిని కాపాడుతున్నామనగా, ఇటువంటి ఘటనలు జరగడం ఆ భద్రతా వ్యవస్థపై అనుమానాలను కలిగిస్తోంది. ప్రత్యేకించి ఏపీ టాస్క్‌ఫోర్స్ బలగాలు, యాంటీ కోచింగ్ విభాగం, ఫ్లయింగ్ స్క్వాడ్లు, అటవీ తనిఖీ కేంద్రాల సిబ్బంది కూడా ఈ తరలింపును గుర్తించలేకపోవడం గమనార్హం.
హైదరాబాద్‌లో ఏనుదు దంతాలు
హైదరాబాద్‌లో నమోదైన కేసులో స్వాధీనం చేసుకున్న రెండు దంతాలు శేషాచలం ప్రాంతానికి చెందినవే అని గుర్తింపు వచ్చింది. వీటిని సేకరించేటప్పుడు ఏనుగు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఇటువంటి దంతాల స్మగ్లింగ్ పూర్వ కాలంలోనూ జరిగిందా? ఇప్పటివరకు ఎంత మేరకు ఏనుగులు ఈ అక్రమానికి బలయ్యాయి? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవు. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో సుమారు 40కి పైగా ఏనుగులు ఉన్నాయని అంచనా. ఉమ్మడి జిల్లాల్లో అయితే 100కు పైగా గజరాజులు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏనుగుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఎక్కువగా కనిపిస్తోంది.