తిరుమలలో గత కొన్నాళ్లుగా జంతువులు భయపెడుతున్నాయి. రోడ్లపైకి, నడకమార్గంలోకి వస్తుండడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. గతంలో చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు పలు చర్యలు చేపట్టినప్పటికీ జంతువుల రాక ఆగడం లేదు. ఇవాళ శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు కలకలం రేపాయి. పంప్ హౌస్ వద్ద 11 ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో అధికారులు గుర్తించారు. అయితే చెట్టు కొమ్మలు తగలడంతో డ్రోన్ కెమెరా కింద పడిపోయింది. సమీపంలోని పంట పొలాలను ధ్వంసం చేశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు శ్రీవినాయక స్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను గంట పాటు నిలిపివేశారు. ఏనుగుల గుంపును అడవిలోకి తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.