తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్దం..!
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది.;
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను పటిష్టం చేశారు. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సమయాన్ని పెంచడంతోపాటు పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు.
ప్రతీ వెయ్యి మందికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం 2 వేల 410 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు, నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 17 లక్షల 11 వేల 195 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8.38 లక్షలమంది పురుష ఓటర్లు, 8.71 లక్షల మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలవద్ద కోవిడ్ వ్యాప్తిని నిరోధించే విధంగా శానిటైజేషన్, మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచింది. ఎండ వేడిని తట్టుకునేందుకు టెంట్లు, మంచినీటి సౌకర్యం వంటి సౌకర్యాలను సిద్ధం చేసారు అధికారులు.
పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. 466 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో రక్షణ ఏర్పాట్లు చేసారు. ఎన్నికల విధుల్లో 10 వేల 796 మంది ఎన్నికల సిబ్బంది, 13 వేల 827 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలతో బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. పోలింగ్ కేంద్రం ఎక్కడుందో ఓటరు తెలుసుకునేందుకు ఈసారి 'మే నో పోలింగ్ స్టేషన్ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.