కొత్తవలసలో వైసీపీ మద్దతుదారుడు గెలిచినట్టు ప్రకటించడంపై కోళ్ల లలిత ఆగ్రహం

Update: 2021-02-22 11:15 GMT

కొత్తవలసలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడంపై శృంగవరపుకోట టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మండిపడ్డారు. 260 ఓట్ల పైచిలుకు మెజార్టీతో టీడీపీ మద్దతుదారుడు గెలిస్తే.. ఆర్వో రమేశ్‌ మాత్రం వైసీపీ బలపరిచిన అభ్యర్ధి గెలిచాడంటూ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

కౌంటింగ్‌ కేంద్రంలో వైసీపీ నాయకులతో మాట్లాడిన తరువాతనే.. 10 ఓట్ల తేడాతో వైసీపీ మద్దతుదారుడు గెలిచినట్టు ప్రకటించారని కోళ్ల లలిత కుమారి ఆరోపించారు. మెజారిటీ విషయంలో ఆర్వో ఒక్కోసారి ఒక్కో లెక్క చెప్పారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గడం దారుణం, అన్యాయం అని అన్నారు. పైగా ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులు, పార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకోకుండానే వైసీపీ మద్దతదారుడు గెలిచాడని ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు.

కొత్తవలస ఎమ్మార్వో ఆఫీసు ముందు టీడీపీ బలపరిచిన అభ్యర్ధి నిరసనకు దిగారు. రీకౌంటింగ్ జరిపించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్ధితో పాటు టీడీపీ నేతలు కూడా నిరసనలో పాల్గొన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాసిన ఆర్వో రమేశ్‌ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.

కొత్తవలస డ్రామాపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తవలస మాజీ సర్పంచ్ గోరపల్లి రాముకి చంద్రబాబు ఫోన్ చేశారు. ఈ విషయంపై ఎలా ముందుకెళ్లాలో సూచనలు ఇచ్చారు. విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి 250 ఓట్ల ఆధిక్యం వచ్చిందని విపక్షం చెబుతోంది. కాని, శృంగవరపుకోట ఎమ్మెల్యే వచ్చి వెళ్లిన తరువాత వైసీపీ మద్దతుదారుడు 10 ఓట్ల మెజారిటీతో గెలిచారని ప్రకటించడంపై టీడీపీ మండిపడుతోంది. మరోవైపు కొత్తవలస కేంద్రానికి వచ్చిన ఆర్డీవోకి టీడీపీ బలపరిచిన అభ్యర్ధి జరిగిన విషయం వివరించారు. అయినా సరే.. ఆర్డీవో మాత్రం తానేం చేయలేనని.. ఆర్వో రమేశ్‌ నిర్ణయమే ఫైనల్ అని చేతులెత్తేశారు. కాకపోతే.. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని ఆర్డీవో తెలిపారు. దీంతో ఆర్డీవోకి టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంప్లైంట్‌ ఇచ్చారు.

Tags:    

Similar News