AP : ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు : సీఎం చంద్రబాబు నాయుడు

Update: 2025-08-29 06:00 GMT

రాష్ట్రంలోని ప్రతీ కుటుంబ సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఫ్యామ్లీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..” రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలి. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలి. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోరు కేటాయించాలి. ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలి. దీని కోసం ఫ్యామిలీ కార్డును తీసుకురండి. ప్రతి కుటుంబానికి ఆ ఫ్యామిలీ కార్డు అందించాలి. ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపర్చడంతో పాటు... పూర్తి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా... కుటుంబంలో ఎంత మంది ఉంటే.. వారందరికీ ఆ కార్డును ఇస్తే.. ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి.” అని సీఎం సూచించారు.

సమాచార అనుసంధానమే కీలకం

క్షేత్ర స్థాయిలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో ఉండాలి. ప్రతి శాఖకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించుకోవాలి.. వాటిని అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం. పదే పదే డేటా గురించి, డేటా అనుసంధానం గురించి మాట్లాడ్డానికి బలమైన కారణం ఉంది. క్షేత్ర స్థాయికి సంబంధించిన పక్కా సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే.. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ రీ-ఇంజినీరింగ్‌కు అత్యథిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీ, ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారికి లబ్ది అందడం లేదు. ఓసీల్లో కూడా ఇంకా ఆర్థికంగా వెనుకబడి వారున్నారు. వారి అవసరాలను గుర్తించాలి. అలాంటి వారిని గుర్తించాలన్నా... వారి వెనుకబాటుతనాన్ని రూపుమాపాలన్నా... సమాచారం అవసరం. రాజకీయంగా పార్టీ యంత్రాంగం నుంచి నేను చేయాల్సింది చేస్తున్నాను. వారిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేయాలి. దాని కోసమే సమాచారాన్ని అనుసంధానించే అంశం మీద ఫోకస్ పెట్టాలని చెబుతున్నాను.” అని చంద్రబాబు వెల్లడించారు.

ఉమ్మడి కుటుంబాలే ఆస్తి

ప్రజలే ఆస్తి. వారి ద్వారానే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి. జనాభా పెరిగితే... సంపద పెరిగే రోజులు వచ్చాయి. ఇది కొనసాగాలంటే.. చక్కటి కుటుంబ వ్యవస్థ ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం అనే మన సంస్కృతిని మరింతగా ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోంది. అలా జరగడం బాధాకరం. ప్రతి కుటుంబ సంతోషాన్ని కోరుకుంటున్న ప్రభుత్వమిది. పథకాల కోసం కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితిని తప్పించాలని భావిస్తున్నాం. దీని కోసం పాపులేషన్ పాలసీని త్వరలో తెస్తాం. అధికారులు ఆ దిశగా కసరత్తు చేయాలి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే.. పథకాలు రావనే ఆందోళన లేకుండా ఉండేందుకు అవసరమైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను రీ-డిజైన్ చేస్తాం. లబ్దిదారులకు మరింత మేలు చేకూర్చడంతోపాటు... కుటుంబాలు విడిపోకుండా చూస్తాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News