Sunita statement in CBI: తండ్రి హత్య వెనుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల పాత్ర.. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత
Sunita statement in CBI: వివేకా కుటుంబ సభ్యులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. వివేకా హత్య జరిగిన తరువాత వేళ్లన్నీ టీడీపీ వైపే తిప్పారు.;
Sunita statement in CBI: వైఎస్ విజయమ్మ కూడా తన మరిదిని హత్య చేసింది టీడీపీనే అంటూ లేఖ రాసింది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే అనుమానాలు వచ్చాయి. కాని, స్వయానా వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, వివేకా కూతురు సునీత, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. సీబీఐతో పంచుకున్న విషయాలు, ఇచ్చిన వాంగ్మూలాలు చూస్తే.. కుట్రలో కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు స్నేహితులు తప్ప వేరే వాళ్లు కనిపించడం లేదు. పైగా వివేకా కుటుంబ సభ్యుల వాంగ్మూలాల్లో జగన్, భారతి, సజ్జల పేర్లు వినిపించాయి తప్ప ఎక్కడా టీడీపీ అనే పదమే కనిపించలేదు.
వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇచ్చిన వాంగ్మూలంలో.. హత్య వెనక కుటుంబ సభ్యులు, సన్నిహితుల పాత్ర ఉన్నట్టు స్పష్టంగా చెప్పుకొచ్చారు. వివేకా హత్యకు ముందు రోజు ఏం జరిగింది, ఎవరు ఎవరెవరికి ఫోన్లు చేశారు అనే వివరాలన్నీ సునీత సీబీఐకి అందజేశారు. వివేకా హత్య కేసులో బంధువులను, సన్నిహితులను అనుమానించడానిక గల కారణాలను కూడా సీబీఐకి వివరించారు. అందులో ప్రధానమైనది.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో, అతని తండ్రి భాస్కర్‌రెడ్డితో రాజకీయంగా, బంధుత్వపరంగా వివేకాతో ఉన్న శత్రుత్వం గురించి సీబీఐకి వివరించారు సునీత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వైఎస్ మరణంతో పులివెందులకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ స్థానం నుంచి భాస్కర్‌రెడ్డి పోటీ చేయాలనుకున్నారని, కానీ విజయమ్మ లేదా షర్మిల పోటీచేయాలని వివేకా సూచించారని సునీత సీబీఐకి తెలిపారు. వివేకాపై అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి కోపం పెరగడానికి ఇది కూడా ప్రధాన కారణమన్నారు సునీత. పైగా వివేకా చనిపోయాక హత్యాస్థలంలో ఆధారాల్ని తుడిచేయాలని భాస్కర్‌రెడ్డి తనను ఆదేశించినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పడం కూడా ఆయనపై అనుమానానికి కారణమని సునీత స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఈ కేసులో ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని తాను అనుమానిస్తున్నానని, కాని ఎంపీ అవినాష్‌రెడ్డి అతన్ని కాపాడుతున్నాడని తెలిపింది. అసలు అవినాష్‌రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేంద్రరెడ్డిని వెంటపెట్టుకుని వెళ్లి డీజీపీని కలవాల్సిన అవసరమేంటని సునీత ప్రశ్నించారు.
ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై అనుమానాలు పెరగడానికి పలు కారణాలను సీబీఐకి వివరించారు వివేకా కూతురు సునీత. వివేకా హత్య జరిగిన ప్రదేశం నుంచి అవినాష్‌రెడ్డి వెళ్లిపోయినా శివశంకర్‌రెడ్డి మాత్రం అక్కడే ఉన్నారు. నిజానికి వివేకానందరెడ్డి అంటే శివశంకర్‌రెడ్డికి భయమని, ఎప్పుడూ వివేకా ఇంట్లోకి రావడం గాని, వివేకా ఎదురుపడేంత ధైర్యం గాని చేయలేదని సునీత చెప్పుకొచ్చారు.
అలాంటి వ్యక్తి వివేకా హత్య తరువాత అక్కడే ఉండడం, వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేయడం, స్వయంగా జగన్ సొంత పత్రిక జర్నలిస్ట్‌కు.. గుండెపోటుతోనే వివేకా చనిపోయారని చెప్పడం, హత్యాస్థలంలో ఫొటోలు తీయడానికి శివశంకర్‌రెడ్డి ఎవరినీ అనుమతించకపోవడం, చివరికి పోస్టుమార్టానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ డాక్టర్ సతీష్ శివశంకర్‌రెడ్డికే చెబుతూ రావడం.. ఇవన్నీ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై అనుమానాలు పెంచాయని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు సునీత.
వివేకా హత్య కేసులో తుమ్మలపల్లె యురేనియం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డిపైనా సునీత అనుమానాలు వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్‌రెడ్డి కచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ ఉదయ్‌కుమార్ రెడ్డి తన ఫ్రెండ్స్‌తో చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకంగా అవినాష్‌రెడ్డి అరెస్ట్ అవుతారని చెప్పారంటే.. హత్య గురించి తెలిసే ఉంటుందా అన్న అనుమానాన్ని సీబీఐ ముందు వ్యక్తపరిచారు సునీత.
అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నప్పుడు.. రెండు, మూడు కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకుంటే పోతుంది కదా అని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో ఉదయ్‌కుమార్ రెడ్డి అనడంపైనా సునీతకు అనుమానాలు వ్యక్తం చేశారు.
వెస్ భారతి రెడ్డికి స్వయానా బాబాయ్ కొడుకు అయిన ఈసీ సురేందర్‌రెడ్డిపైనా వివేకా కూతురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈసీ సురేందర్ రెడ్డి భార్య సాక్షి అడ్మిన్ విభాగంలో పనిచేసేవారు. వివేకా గుండెపోటుతోనే చనిపోయారన్న కథనాన్ని ఆ మీడియాలో ఉదయం పదిన్నర వరకు నడిచేలా సురేందర్‌రెడ్డే నడిపించారనేది సునీత అభియోగం. ఉదయం వచ్చి చూసిన వాళ్లకంతా అది హత్య అని అర్ధమవుతున్నా సరే.. అధికారిక మీడియాలో మాత్రం గుండెపోటుతోనే చనిపోయారని ప్రసారం చేయించడంపైనా సునీత అనుమానాలు వ్యక్తం చేశారు.