అమరావతి గ్రామాల్లో ఉధృతంగా రైతుల పోరాటం
అమరావతి గ్రామాల్లో రైతుల పోరాటం ఉధృతంగా సాగుతోంది. ఇవాళ్టితో నిరసనలు 262వ రోజుకు చేరాయి..;
అమరావతి గ్రామాల్లో రైతుల పోరాటం ఉధృతంగా సాగుతోంది. ఇవాళ్టితో నిరసనలు 262వ రోజుకు చేరాయి. ఉన్న అమరావతిని అభివృద్ధి చేయకుండా.. ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయంపై రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా.. ఉన్న రాజధానిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టువదలని సంకల్పంతో ఉద్యమాన్ని హోరెత్తిస్తూనే ఉన్నారు రైతులు.
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగే వరకు ఆందోళనలు ఆగవని రైతులు తేల్చిచెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసి రైతుల కక్షపాతిగా మారిందని ఆరోపించారు. తమను మోసం చేయాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మార్చుకోవాలని కోరుతున్నారు రైతులు. 3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినదిస్తున్నారు.
రాజధానిని తరలించి తమ పొట్టకొట్టొద్దన్నారు రైతులు. తమకు న్యాయస్థానాలు ఉండగా ఉన్నాయంటున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేస్తే ఇప్పుడు అవమానిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అన్నా, అక్కడి ప్రజలన్నా ఈ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని ప్రశ్నిస్తున్నారు.