AP: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
మరో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక సంక్షేమ చర్యల్లో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు దివ్యాంగులకు కూడా అదే విధమైన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మహిళలకు అమలు చేస్తున్న “స్త్రీ శక్తి” పథకం వర్తించే అన్ని బస్సుల్లోనే దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం అనుమతించబడుతుంది. అంటే సాధారణంగా మహిళలకు ఎలాంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం లభిస్తుందో, అదే విధానం దివ్యాంగులకూ వర్తిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగులకు ప్రయాణ సౌలభ్యం కలగనుంది.
ఇక దివ్యాంగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతి దివ్యాంగుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందిస్తోంది. అదనంగా “ఇంద్రధనస్సు” పథకాల కింద దివ్యాంగుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ కొత్త ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం “ఇంద్రధనస్సు” పథకంలో భాగంగానే అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు 2026 ఫిబ్రవరి 28న జీఎంఎస్ నెం.21 అధికారికంగా జారీ అయింది. దివ్యాంగుల సామాజిక, ఆర్థిక స్వావలంబనకు ఇది మరొక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.