మూడేళ్ల చిన్నారిపై కన్న తండ్రి విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో వైరల్ అయింది. ఈ అమానవీయ ఘటన అనంతపురం నగరంలో చోటుచేసుకుంది. అనంతపురంలోని జేఎన్టీయూ కళాశాల సమీపంలో పావని బాయ్స్ ప్రైవేట్ వసతి గృహంలో కడప జిల్లాకు చెందిన దంపతులు శివ, మౌనిక పనిచేస్తున్నారు. వీరికి మూడు ఏళ్ల మేఘన అనే చిన్నారి ఉంది. వసతి గృహంలోని గదులను దంపతులిద్దరూ శుభ్రం చేస్తున్న సమయంలో గదులలో చిన్నారి మేఘన మూత్ర విసర్జన చేస్తోందని కోపద్రకుడైన కన్న తండ్రి శివ చిన్నారిని చితకబాదాడు. అక్కడున్న వ్యక్తులు దీనిని చరవాణిలో చిత్రీకరించారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి తెలిసి తెలియని చేసిన తప్పునకు కర్కశంగా ప్రవర్తిస్తున్న తండ్రి పై చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ద్వారా సమాచారం సేకరించి ఒకటో పట్టణ పోలీసులు చిన్నారి తండ్రి శివ కు కౌన్సెలింగ్ ఇచ్చారు.