ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి గాంధీ వ్యవసాయ మార్కెట్‌లో శ్రీవర ఎంటర్‌ప్రైజెస్ షాప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు షాపులో నుంచి పొగ రావడంతో మార్కెట్ వెళ్తున్న రైతులు చూసి అగ్నిమాపక శాఖకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో హోమ్ అప్లయన్స్ పరికరాలు మొత్తం కాలి బూడిదయ్యాయి. పండగ సమయం కావడంతో షాపులో ఎక్కువ సామాన్లు నిలువ ఉంచినట్లు షాపు యజమాని తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 40 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.