శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం ఆకుతోటపల్లిలో ఫుడ్ పాయిజన్ వల్ల 15 మంది అస్వస్థతకు గురి కావడంతో 8 మంది ఆసుపత్రి పాలయ్యారు.ఆషాడ తొలి ఏకాదశి సందర్భంగా బాలకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో పూజలు నిర్వహించిన గ్రామస్తులు నైవేద్యంగా సోమవారం సాయంత్రం పాయసాన్ని తిన్నారు. అప్పటినుంచి వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురి కావడంతో అప్రమత్తమైన స్థానికులు అందరిని హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.వైద్యులు వారికి ప్రథమ చికిత్సను అందించారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండడంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. వండిన పాయసంలో బల్లి పడడం వల్లే పాయసం విషతుల్యంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు భాను ప్రకాష్ మాట్లాడుతూ 15 మంది అస్వస్థతతకు గురైతే నేను 8 మంది ఆసుపత్రిలో చేరారని, వైద్య బృందం ఆకుతోట పల్లి గ్రామంలో పర్యటించి ఇంటింటిని సందర్శించి అవసరం మేరకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.