క్వార్ట్జ్ అక్రమాలు, పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మంత్రితోపాటు ఆయన PA ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నోటీసుల ప్రకారం ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ DSP కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నట్లు వెల్లడించారు. చెన్నైలో నివాసముండే విద్యాకిరణ్‌కు.. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట మైకా తవ్వకాలకు అనుమతి ఉంది. దానికి లీజు గడువు ముగియడంతో పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెల్లరాయి గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారు. లీజుదారుడు అంగీకరించకపోయినా.. ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలించారు. అప్పట్లో మంత్రిగా వ్యవహరిస్తున్న కాకాణి సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే ఈ దందా జరిగింది. దానిపై ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అప్పట్లో ఆందోళన కూడా చేశారు. ఎన్నికల సమయంలో అప్పటి డీడీ శ్రీనివాసకుమార్ ఇతర అధికారులు ఆ గనుల్ని పరిశీలించి సుమారు 61,313 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్‌ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. సీనరేజి ఛార్జీలతోపాటు పదింతల జరిమానా.. మొత్తం రూ.7.56 కోట్లుగా లెక్క తేల్చి షోకాజ్ నోటీసులిచ్చారు. దీనిపై ప్రస్తుత మైనింగ్ డీడీ బాలాజీనాయక్ గత నెల 16న పొదలకూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.