తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఇప్పటికే మాట్లాడినట్లు ప్రధాని తనతో అన్నారని, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి చెరో రూ.5లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. తన కుమారుడు, కుమార్తె విడివిడిగా చెరో రూ.2.5లక్షల చొప్పున అందజేశారని ఆయన వెల్లడించారు.