AP : వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ : మంత్రి గొట్టిపాటి రవి కుమార్

Update: 2025-08-26 09:15 GMT

వినాయక చవితి ఉత్సవాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్టు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. మొత్తం 15 వేల ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.25 కోట్లు కేటాయించిందని వివరించారు. ప్రజల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఒంగోలులో సోమవారం పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.... ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరించిన జనసేన నేత షేక్ రియాజ్‌ తో సమావేశమై అభినందించారు.

అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై మంత్రి రవి కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అరకొర సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టాలని మాత్రమే ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో సంపద సృష్టి పూర్తిగా సున్నా కాగా, కూటమి ప్రభుత్వం మాత్రం సంపద సృష్టించి తద్వారా సంక్షేమాన్ని అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుర్తు చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాస్తవానికి దగ్గరగా, ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ప్రజలకు ఇచ్చి వాటిని అమలు చేస్తోందని స్పష్టం చేశారు. పింఛన్ల విషయంలోనూ కూటమి ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు చేపట్టిందని మంత్రి గొట్టిపాటి రవి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇటీవల 1.10 లక్షల మందికి కొత్తగా స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

అయితే కొందరు అర్హత లేని వారికి కూడా పింఛన్లు అందుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అయితే దానిని వక్రీకరించి వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పం” అని మంత్రి రవి కుమార్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News