RAINS: వరుణుడి బీభత్సం
ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకలు... తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం... ఏపీలోని జిల్లాల్లో విస్తారంగా వానలు;
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, మురుగుకాలువలు పొంగి జనావాసాలను ముంచెత్తాయి. రోడ్లు కాలువలను తలపించాయి. మైదానాలు చెరువుల్లా మారిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయి.. జనం గంటల తరబడి పడిగాపులు పడ్డారు. లోతట్టు కాలనీలు నీట మునిగాయి. కాలువలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. వరి, పత్తి, మినుము ముంపునకు గురయ్యాయి.
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లపై రెండుమూడు అడుగుల ఎత్తుకుపైగా నీరు ప్రవహించింది. గుంటూరు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. అయితే, మరో నాలుగు రోజులు ఏపీలో వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు, బాపట్ల, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని స్కూళ్లుకు సెలవులు ప్రకటించారు. గోదావరి జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లా అతలా కుతలంగా మారింది. జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాలు జలమయంగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా పోలీస్ స్టేషన్లు సైతం జల దిగ్బంధంలో చుట్టుకుపోయాయి. దీంతో అధికారులు నీటిలోనే సేవలందిస్తున్న పరిస్థితి కోనసీమ జిల్లాలో దాపరించింది.. మరోపక్క ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి సూర్యాపేట అస్తవ్యస్తమైంది. సూర్యాపేట జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు ఎస్‌లో కురిసన వానాలకు మోడల్ స్కూల్ చెరువును తలపిస్తున్నది. కోదాడలోని పలు కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మోతె మండలం ఉర్లుగొండ వద్ద పాలేరు వాగు పొంగిపొర్లుతున్నది. నడిగూడెంలో వరద నీరు ఇండ్లలోకి చేరింది. చౌదరి చెరువు మత్తడి దుంకడంతో పలు కాలనీలు నీటమునిగాయి. దీంతో ఇండ్లలోకి చేరిన నీటిని కాలనీవాసులు ఎత్తిపోస్తున్నారు. గోండ్రియాల-తుమ్మర మధ్య రహదారిపై వరద ప్రవాహంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.