MLC: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఆరంభం
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్..;
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో అధికారులు, పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 16,737 మంది టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. ఆరు జిల్లాల పరిధిలోని 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత బూత్ ఎజేంట్ల సమక్షంలో బ్యాలేట్ బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేసి.. సురక్షితంగా కాకినాడ జేఎన్‌టీయూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈనెల 9వ తేదీన నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. యూటీఎఫ్ నేత బొర్రా గోపీమూర్తి, గంధం నారాయణ రావు, డాక్టర్ కవలనాగేశ్వరరావు, పులుగు దీపక్, నామన వెంకట లక్ష్మి(విళ్ల లక్ష్మి) పోటీ పడుతున్నారు. మొత్తం ఆరు జిల్లాల్లో 116 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.