విశాఖకు వచ్చే నెల గూగుల్ సంస్థ రానుందని నిన్న కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ త్వరలో ఏర్పాటు కానుందన్నారు. కూటమి అధికారం చేపట్టాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. అనంతపురంలోని లేపాక్షి, కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతం భవిష్యత్‌లో భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. ‘రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం, కొప్పర్తి, ఓర్వకల్లులో పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అనంతపురంలోని లేపాక్షి- కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతం భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుంది. లాజిస్టిక్ కార్పొరేషన్ ద్వారా పోర్టులు, విమానాశ్రయాల మధ్య రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలి. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు కానీ, నౌకల తయారీ కేంద్రం కానీ లేదా ఫిషింగ్ హార్బర్ కానీ ఏర్పాటు చేయాలన్నారు.