Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియోతో పాటు వైరల్ అవుతున్న పాత ఆడియోలు..
Gorantla Madhav:గోరంట్ల న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. వైసీపీ నేతల వ్యవహారాలపై చర్చ జరుగుతోంది;
Gorantla Madhav: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. వైసీపీ నేతల పాత వ్యవహారాలపై కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీపై వచ్చిన ఆరోపణలను బయటకు తీసి చర్చ పెడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో, ప్రజలు గెలిపించిన పార్టీలో ఇలాంటి వ్యవహారాలు జరగడం ఏంటనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.
అటు సోషల్ మీడియాలోనూ రచ్చ రేపుతున్నారు. ఇప్పటికే అంబటి, అవంతి.. టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్‌గా మారారు. ఇప్పుడు ఈ లిస్టులో వైసీపీ ఎంపీ గోరంట్ల వచ్చి చేరారని మాట్లాడుకుంటున్నారు. అంబటి రాంబాబుకు సంబంధించినదిగా చెబుతున్న ఆడియోను, అవంతి శ్రీనివాస్‌పై వైరల్ అయిన వీడియోను మరోసారి సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రంబోలా చేస్తున్నారు.
అంబటి రాంబాబుదిగా చెబుతున్న ఒక ఆడియో గతంలో లీక్ అయింది. అందులో ఒక మహిళను మసాజ్‌కు రమ్మనడం, బాగుంటుందా, అన్నీ చేస్తుందా అనడం బాగా వైరల్ అయింది. అయితే, అదంతా ఎవరో గిట్టని వాళ్లు చేసిన మిమిక్రీ అని కొట్టిపారేశారు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఆడియోను మరోసారి షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
అంబటి రాంబాబు ఎపిసోడ్ జరిగిన వారం వ్యవధిలోనే అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో ఓ వీడియో బయటికొచ్చింది. అరగంటలో పంపించేస్తా.. రా అంటూ వాయిస్ వినిపించింది. అయితే, అవంతి శ్రీనివాస్ విషయంలో వైసీపీ వాళ్లే ఇలా ట్రాప్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఆ అరగంట వాయిస్‌ను కూడా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు.
వైసీపీలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మొన్నామధ్య రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఒక వివాహితపై భర్త కళ్లముందే అత్యాచారం జరిగింది. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి తానేటి వనిత.. కొన్ని రేప్‌లు అనుకోకుండా అలా జరుగుతుంటాయ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సాక్షాత్తు హోంమంత్రి, అందులోనూ మహిళగా ఉన్న ఒక మంత్రే.. అత్యాచారాలు జరుగుతుంటాయ్ అని చెప్పినప్పుడు.. అధికార పార్టీ నేతలు ఇలా కాకుండా ఇంకెలా ఉంటారంటూ కామెంట్ చేస్తున్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే.. ఇంట్లో తల్లిదండ్రులు అమ్మాయిలను పద్దతిగా పెంచాలంటూ మరో వివాదాస్పద కామెంట్ చేశారు. అలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చే హోంమంత్రి ఉన్నప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇలాగే బరితెగించి ప్రవర్తిస్తారని మాట్లాడుకుంటున్నారు.
అసలు అంబటి రాంబాబుపై ఆరోపణలు వచ్చినప్పుడే జగన్ యాక్షన్ తీసుకుని ఉంటే.. వారం వ్యవధిలోనే అవంతిదిగా చెబుతున్న వీడియోలు వచ్చేవి కావని చెబుతున్నారు. అంబటి రాంబాబుపై తీవ్ర ఆరోపణలు వచ్చినా సరే.. మంత్రి పదవి ఇచ్చి స్థాయిని పెంచారు తప్ప.. మరొకరు అలాంటి పనులు చేయకుండా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపించాయి. ఆనాడు అవంతి శ్రీనివాస్‌ను వెంటనే మంత్రి పదవిలోంచి తీసేసి ఉంటే.. ఇవాళ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో ఇలా న్యూడ్ వీడియో కాల్స్ చేసేవారే కాదంటూ మాట్లాడుకుంటున్నారు.
కనీసం ఇప్పుడైనా గోరంట్లపై చర్యలు తీసుకుంటే గానీ.. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డుకట్టపడదని చెబుతున్నారు. నిజానికి హోంమంత్రిగా తానేటి వనిత అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడే మంత్రి పదవి నుంచి తప్పించి ఉంటే.. ఇవాళ వైసీపీ నేతల్లో కొందరికైనా భయం ఉండేదని మహిళా నేతలు అంటున్నారు. సాక్షాత్తు కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే ఇలా మహిళల పట్ల బరితెగించి ప్రవర్తిస్తే.. ఇక పార్టీలోని కిందిస్థాయి నేతలు ఇంకెలా బరితెగిస్తారో వైసీపీ అధిష్టానమే ఆలోచించుకోవాలని హెచ్చరిస్తున్నారు.