ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను మానసిక వైద్యశాలగా మార్చాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు సలహా ఇచ్చారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో విశాఖలో సన్మాన సభ ఏర్పాటు చేశారు.‘‘అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం.. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. చాలా ఏళ్లు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను. అప్పుడు సంక్షేమం కోసం అప్పులు చేసేవారు. కానీ, గత ప్రభుత్వంలో అన్ని తాకట్టులో పెట్టడం చూశా. విశాఖలో ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసింది. అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేది. ఈ ప్యాలెస్‌ను ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది. దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని నా ఉచిత సలహా. కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసం వాడాలి. మన అందరినీ ఇబ్బంది పెట్టారు. మనో ధైర్యంతో నిలబడాలి.. లొంగిపోకూడదు. మన వీర సైనికులు ప్రపంచానికి మన సత్తా చూపించారు. అన్ని దేశాలకు ఒక పాఠం నేర్పించాం’’ అని అశోక్‌గజపతిరాజు అన్నారు.
కైలాసగిరిపై సిద్ధమైన గాజు వంతెన
విశాఖలో మరికొద్ది రోజుల్లో గాజు వంతెన పర్యాటకులకు థ్రిల్ పంచనుంది. మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. ఇది దేశంలోనే అతి పొడవైనది. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో దీనిని నిర్మించినా.. భద్రత దృష్ట్యా ఒకసారికి కేవలం 40 మందికి మాత్రమే అనుమతిస్తారు. దీనిపైకి ఎక్కిచూస్తే చుట్టూ ఎత్తయిన కొండలు, కింది భాగంలో లోయ, కనుచూపు మేరలో సాగరం కనిపిస్తాయి. గాల్లో తేలియాడుతున్నట్లు, కొత్త లోకంలో విహరిస్తున్న భావన పర్యాటకులకు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
లిక్కర్ కేసులో సిట్ దూకుడు
ఏపీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ నేత విజయానందరెడ్డి ఇళ్లు, కంపెనీల్లో సిట్ తనిఖీలు చేసింది. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో, నలందానగర్లోని నిఖిలానంద అపార్టుమెంట్లో అధికారులు సోదాలు చేశారు. విజయానందరెడ్డి 2024లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ను రెండ్రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. విజయానందరెడ్డి ఇంటి అడ్రస్సుతో సీబీఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఉండటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ ఫ్రా కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. అధికారులు చిత్తూరు వెళ్లి ఆయా కంపెనీల్లో తనిఖీలు చేశారు. ఇప్పటికే పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. మద్యం ముడుపులను కంపెనీల్లోకి మళ్లించినట్లుగా అధికారులకు సమాచారం అందడంతో ఈ సోదాలు చేపట్టారు. దీంతో ఆయా కంపెనీల్లో అధికారుల తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. సమాచారం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ శ్రేణులు ఆయా కంపెనీల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. సిట్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. సిట్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. విరెడ్డి భాస్కర్‌రెడ్డికి సంబంధించి హైదరాబాద్‌లోనూ సిట్ తనిఖీలు సాగుతున్నాయి. తిరుపతిలో ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో, తిరుపతి గ్రామీణ మండలంలోని ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల తర్వాత సిట్ కీలక నేతలను అరెస్ట్ చేస్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.