AP Theatre Issue: ఏపీలో సినిమా థియేటర్‌లలో తనిఖీలు..

AP Theatre Issue: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల తనిఖీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.;

Update: 2021-12-15 07:00 GMT

AP Theatre Issue: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల తనిఖీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి కల్లా తనిఖీలు పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికాలకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సినిమా టికెట్ల ధరలు, అదనపు ఆటల అంశానికి సంబంధించి..ప్రభుత్వానికి వరుస దెబ్బల నేపథ్యంలో ఈ తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడింది.

అదనపు ధరలు, అదనపు ఆటలు లేకుండా పవన్‌కళ్యాణ్‌ వకీల్‌సాబ్‌ సినిమాను.. కట్టడి చేయడంలో అధికారులు సఫలమయ్యారు. అయితే బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విషయానికి వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయ్యింది. అదనపు ఆటలు, అధిక ధరలతో పలుచోట్ల అఖండ సినిమా కొన్ని చోట్ల ప్రదర్శించారు. సీఎం సొంత జిల్లా కడపలో సైతం అఖండ సినిమాకు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేశాయి పలు థియేటర్లు.

దీంతో అఖండ సినిమా విషయంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదని.. అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా టార్గెట్‌గా తెరపైకి తనిఖీలు వచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ల ధరలపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయిండంతో.. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

తమ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడంపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం.. తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేసింది. ప్రభుత్వం తరపున వాదనలు వినాలని ఏజీ హైకోర్టును కోరారు. ఈ లంచ్ మోషన్‌ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఇటు టికెట్ల ధరలపై కోర్టుకు వెళ్లడంతోపాటు..అటు థియేటర్ల తనిఖీలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఏపీలో సినిమాల ప్రదర్శనలో ఎలాంటి ట్విస్ట్‌లు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ధియేటర్ల విషయంలో తగ్గేదే లేదంటున్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే వాటిని పునరుద్ధరించారా లేదా? ఫైర్‌ సేఫ్టీ, ఎలక్రికల్‌ సేఫ్టీతో పాటు.. నిబంధనలు అన్నీ పాటిస్తున్నారా లేదా అనేది ఎమ్మెర్వోలు తనిఖీ చేయనున్నారు. షో వేసే సమయంలో వీఆర్‌వోలు థియేటర్ల దగ్గర ఉండి పరిశీలించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో.. సర్కార్‌తో సినిమా పరిశ్రమ పోరు రసవత్తరంగా మారింది.

Tags:    

Similar News