governer: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు
అవకాశాల కోసం పరుగెత్తలేదు: అశోక్‌గజపతిరాజు;
మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నియమించారు. గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు నియమితులయ్యారు. హరియాణా గవర్నర్‌గా ప్రొఫెసర్ ఆషిమ్‌కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమించారు. ఈ ముగ్గురిని గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజా నాయకుడిగా గుర్తింపు
విజయనగరం జిల్లా ప్రజలకు, రాష్ట్ర రాజకీయ వర్గాలకు పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతిరాజు. విజయనగర సంస్థానాధీశుల వారసుడే అయినా రాచరికపు పోకడలకు దూరంగా ఉంటూ సిసలైన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. నీతి, నిజాయతీలకు నిలువుటద్దంగా నిలిచారు. నమ్మిన సిద్ధాంతాలకు తుది దాకా కట్టుబడే నైజం. విజయనగరం మహారాజు అయిన డాక్టర్ పీవీజీ రాజు కుమారుడైన అశోక్ గజపతి రాజు జిల్లా ప్రజలకు రాజుగారిగా చిరపరిచితులు. జిల్లా టీడీపీ శ్రేణులు ఆయనను పెద్దాయనగా గౌరవించి ఆ పేరుతోనే సంభోదిస్తుంటారు. 1983, 1985, 1989, 1994, 1999, 2009లో టీడీపీ తరఫున గెలిచారు. 2014లో అదే పార్టీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి జయకేతనం ఎగురవేశారు. 2014లో కేంద్ర ప్రభుత్వంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఈయన సతీమణి సునీలా గజపతిరాజు విజయనగరం మున్సిపల్ ఛైర్మన్‌గా సేవలందించారు. టీడీపీ హయాంలో అశోక్ గజపతిరాజు ఎక్సైజ్, వాణిజ్య, ఆర్థిక, రెవెన్యూ, శాస నసభా వ్యవహారాల శాఖల మంత్రిగా 13 ఏళ్లపాటు సేవలందించారు.
అవకాశాల కోసం తానెప్పుడూ పరుగెత్తలేదని తెదేపా సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. అవకాశాలు వచ్చిప్పుడు బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. గవర్నర్‌గా తన పేరును సీఎం చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందన్నారు. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ నియామకంతో తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత నాపై ఉంది. ఓటమితో నిరుత్సాహ పడనక్కర్లేదు.. దాని నుంచి పాఠాలు నేర్చుకుని మరింత ఉన్నతంగా ముందుకు వెళ్లొచ్చు. గోవా అంటే ప్రియ మిత్రుడు మనోహర్ పారికర్ గుర్తొస్తారు. కోరుకొండ సైనిక్ స్కూల్లో అమ్మాయిలకూ చదివే అవకాశం కల్పించాలని ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కోరాను. దేశానికి సేవ చేసే అవకాశం మరోసారి లభించడం ఆనందంగా ఉంది. అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని అశోక్ గజపతిరాజు అన్నారు.