YCP: ఓటర్లకు కుక్కర్లు పంచుతున్న వాలంటీర్
ఇంటింటికి వెళ్లి కుక్కర్ల పంపిణీ...గడపగడపకు తాయిలాలు చేరేలా చూడాలన్న వైసీపీ ఎమ్మెల్యే;
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే... వైసీపీ తాయిలాలకు తెరతీసింది. పెదకూరపాడు నియోజకవర్గంలో ఏకంగా గ్రామ వాలంటీర్లే కుక్కర్లు పంచుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తరఫున ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. మహిళలకు కుక్కర్లు అందించి.. ఓ ఫోటో తీసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శంకరరావుకే మద్దతుగా నిలవాలని వాలంటీర్లు కోరుతున్నారు. ఇటీవల సంక్రాంతి సంబరాల పేరుతో ఎమ్మెల్యే సతీమణి వసంతకుమారి మహిళలకు కుక్కర్లు పంపిణీ చేసి ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాలంటీర్లను ఉపయోగించుకుని ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఇటీవల ఐదు మండలాల్లో పర్యటించి వాలంటీర్లతో సమావేశమైన వసంతకుమారి.... గడపగడపకు తాయిలాలు చేరేలా చూడాలని కోరారు. ఇందుకు ప్రతిఫలంగా కొంత నగదును ఖాతాల్లో జమచేస్తామని వాలంటీర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే సతీమణి ఆదేశాలతో రంగంలోకి దిగిన వాలంటీర్లు.. కుక్కర్ల సంచిని భుజాన వేసుకుని.. ఇంటింటికి తిరిగి పంచుతున్నారు. మండల స్థాయి ప్రజాప్రతినిధి వద్ద కుక్కర్లు స్టాక్ పెట్టి.. అక్కడి నుంచి వాలంటీర్లకు అందిస్తున్నారు.
ఎన్నికల సంఘం హెచ్చరిక
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు... ఐటీ, కస్టమ్స్ లాంటి కేంద్ర, రాష్ట్రాల ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు... E.C. ప్రత్యేకమైన సూచనలు జారీచేసింది. ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలును పటిష్ఠంగా నిర్వహించడంతోపాటు... నగదు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికల సమయంలో... మద్యం, నగదు, ఉచితాల పంపిణీ, మాదకద్రవ్యాల సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించింది.
రాష్ట్రాల సరిహద్దులు దాటి వచ్చే అక్రమ మద్యం విషయంలోనూ నిశిత దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లోని మద్యం కింగ్ పిన్‌ల పైనా నిఘా ఉంచాలని సూచించింది. నగదు చలామణీతోపాటు... ఆన్‌లైన్‌లో నగదు బదిలీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ఆన్‌లైన్ వాలెట్‌లను భర్తీ చేయడం, క్యాష్ ట్రాన్స్‌ఫర్‌లు వంటివాటిపై నిఘా పెట్టాలని నిర్దేశించింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించిన పనివేళల్లో మాత్రమే నగదు రవాణా వాహనాలను అనుమతించాలని పేర్కొంది. ప్రత్యేకించి విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిపాడ్‌ల వద్ద కూడా సంబంధిత కేంద్ర ఏజెన్సీలతో నిఘా పెట్టాలని స్పష్టం చేసింది . అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మాత్రమే 50 లీఫ్‌లెట్స్ ఉన్న 4 వ్యక్తిగతం కాని చెక్ పుస్తకాలు మంజూరు చేయవచ్చని బ్యాంకులకు ఈసీ సూచించింది. రాజకీయ పార్టీలు ఉచితాల కోసం పంచిపెట్టే సున్నితమైన వస్తువులకు సంబంధించి... కొనుగోళ్లపైనా దృష్టి పెట్టాలని సూచించింది.