హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు గోల్డ్ లోన్ విషయంలో గోల్ మాల్ చేసిన నలుగురు వ్యక్తులను అనంతపురం 4వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రాంనగర్ బ్రాంచ్ హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకులో కస్టమర్స్ కు చెందిన ఒక గోల్డ్ ప్యాకెట్ మిస్ కావడంతో పాటు, రెండు ప్యాకెట్లు ట్యాంప్ చేసినట్టు బ్యాంక్ మేనేజర్ గుర్తించారు. ఇందులో గోల్డ్ లోన్ ఆఫీసర్ సతీష్ కుమార్ పాత్ర ఉన్నట్టు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు సూత్రధారులను పట్టుకున్నారు. సతీష్ కుమార్ బ్యాంకులో పనిచేసిన సమయంలో కస్టమర్ల నుంచి తీసుకున్న గోల్డ్ ఆభరణాలను హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులో కాకుండా కస్టమర్లకు తెలియకుండా మోసపూరిత పద్ధతిలో కీర్తన ఫైనాన్స్ మేనేజర్ నరేష్ సహకారంతో ఆ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టాడు. దీని ద్వారా ఎక్కువ లోన్ పొంది.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుండే వాడు. కాలపరిమితి పూర్తి అయిన కస్టమర్ యొక్క గోల్డ్ లోన్ ను, రెన్యువల్ చూస్తున్నామని చెప్పి కస్టమర్లకు తెలియకుండా క్లోజ్ చేసి అదే బంగారం ఆభరణాలను మరల కీర్తన ఫైనాన్స్ లో తాకట్టు పెట్టే వారు. సతీష్ కుమార్ తోపాటు ఇందులో సంబంధం ఉన్న మరో ముగ్గరిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఇందులో ఇప్పటికీ 50 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, మరో రెండు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు బ్యాంకుకు రికవరీ చేయాల్సి ఉందని డిఎస్పీ తెలిపారు.