Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీకి భారీ వరద..69 గేట్లు ఎత్తివేత.. రెండో ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 6.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉద్ధృతిని నియంత్రించేందుకు బ్యారేజీలోని మొత్తం 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తివేసి, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదిలో ప్రవాహం తీవ్రంగా ఉండటంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో వరద నీరు విజయవాడలోని బెరంపార్క్ వైపు ఉన్న రూమ్స్‌ను చేరుకుంటోంది.
సిబ్బంది అప్రమత్తం, భద్రతా చర్యలు వరద ఉద్ధృతిపై ఆదివారం నుంచే పర్యాటక శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు పర్యాటక శాఖ బోట్లను డ్రైవర్లు తాళ్లతో సురక్షితంగా కట్టేశారు. మరోవైపు జిల్లా అధికారులు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నదిలో ఎవరూ స్నానాలకు దిగవద్దని కూడా అధికారులు ప్రజలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.