RAINS: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఏపీకి మరోసారి భారీ వర్షాలు... తెలంగాణలోనూ భారీ వానలు కురిసే అవకాశం;

Update: 2024-12-14 03:00 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం ఇవాళ బలహీనపడనుంది. ప్రస్తుతం ఇది తమిళనాడు దక్షిణంవైపు కదులుతోంది. దీని వల్ల ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు 17, 18 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం.. ఆసియా, ఆగ్నేయ ఆసియా నుంచి భారీగా మేఘాలు.. దూసుకొస్తున్నాయి. ఇవి 16వ తేదీ నాటికి తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉంది. వీటి ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై కనిపించనుంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి 30 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 15 కిలోమీటర్లు, తెలంగాణలో 10 కిలోమీటర్లుగా ఉంటుంది. అల్పపీడన ప్రభావం తగ్గుతుండటంతో.. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లోకి చలి గాలులు జోరుగా వస్తున్నాయి.

ఏపీ జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా నేటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే ఛాన్స్ ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ నెల 15 నాటికి అల్పపీడనంగా మారి.. అనంతరం 48 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 17న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పింది. ఇటీవలే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, తీవ్ర వాయుగుండంగా మారి, తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు అవకాశాలున్నాయని సమాచారం. 

Tags:    

Similar News