నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని ఉత్తర, దక్షిణ జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అత్యధిక వర్షపాతం అంచనా ఉన్న జిల్లాలు పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని, సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు తెలియజేసింది.