AP: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం
పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం... ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ;
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టంపై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్ప పీడనం రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు చేరే అవకాశం ఉంది. ఇవాళ్టికి ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంట పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు, వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు అక్కడక్కడా పడతాయి.
అల్లకల్లోలంగా సముద్రం
ఏపీలోని తిరుపతి, బాపట్ల, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ పరిస్థితుల మేరకు నవంబరు, డిసెంబరులో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటతాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, తమిళనాడులో తీరం దాటాల్సిన అల్పపీడనాలు మన రాష్ట్రంలో దాటుతున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐరోపాకు చెందిన మోడల్ సూచిస్తోంది.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.