GUDLAVALLERU: గుడ్లవల్లేరు ఘటనపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ
ఘటనపై విచారణకు ఆదేశించిన నారా లోకేశ్.. హాస్టల్ బయటే విద్యార్థినులు;
గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై వాస్తవాలు తేల్చేందుకు జేఎన్‌టీయూ(కే) ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించింది. వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్ అండ్ గ్రీవెన్సెస్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ యు.వి.రత్నకుమారి, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ ఎ.ఎస్.ఎన్.చక్రవర్తిలతో కమిటీని నియమించారు. ఇప్పటికే గుడ్లవల్లేరు చేరుకున్న కమిటీ విచారణ ప్రారంభించింది. విద్యార్థులతో పాటు.. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కె.కృష్ణప్రసాద్, వర్ల కుమారరాజాలతో కమిటీ చర్చించింది. ఇప్పటికే మరో సాంకేతిక బృందంతో కమిటీని కూడా ఏర్పాటుచేశారు. ఆరోపణలు వచ్చిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని యాజమాన్యం అదుపులో ఉంచారు. వారివద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ సీసీఎస్ సీఐ రమణమ్మ, సాంకేతిక విభాగం ఎస్‌ఐ మాధురి, మరో ముగ్గురు కానిస్టేబుళ్లతో కమిటీ వేశారు. ఈ కమిటీ విచారణ చేసి నివేదిక ఇస్తుందని.. దోషులపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. వార్డెన్ పద్మావతిని సస్పెండ్ చేయాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించారు.
హాస్టల్ బయటే విద్యార్థినులు
తాము హాస్టల్‌లో ఉండలేమని.. అక్కడ రహస్య కెమెరాలు లేవని ధ్రువీకరిస్తేనే వెళ్తామని విద్యార్థినులు బయటే ఉండిపోయారు. దీంతో బాంబుస్క్వాడ్, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించే పరికరాలతో సోదాలు చేశారు. నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్షన్ అనే విధానంలో పరిశీలిస్తామని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించి సమగ్ర విచారణకు ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థినుల వసతిగృహంలో రహస్య కెమెరాలు పెట్టినట్లు ప్రచారం చేసినవారిలో గుడివాడకు చెందిన ఓ వైకాపా నేత అనుచరుడి తనయుడు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు అంతా సర్దుబాటు చేశారనీ.. తాము ముందే వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు.
చంద్రబాబు ఆగ్రహం
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల హాస్టల్ వాష్‌రూంలలో కెమెరాలు బిగించారని జరిగిన ప్రచారం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించి... విచారణకు ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ.. విచారణకు ఆదేశించారు. దీంతో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ అక్కడికి చేరుకుని, విద్యార్థినులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఒక మహిళా సీఐ ఆధ్వర్యంలో సాంకేతిక బృందాన్ని నియమించి విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ పద్మావతిపై చర్యలకు ఆదేశించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమక్షంలోనే అధికారులు హాస్టల్ మొత్తం తనిఖీ చేశారని.. అక్కడ ఎలాంటి కెమెరాలు లభించలేదని వెల్లడించారు. అయినప్పటికీ దర్యాప్తును కొనసాగిస్తూ సమగ్రంగా విచారణ కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.