TTD: టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్
ఎస్వీ గోశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు... కూటమి ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు;
టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీ గోశాలలో వందలాది గోవులు మృతిచెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అదేస్థాయిలో అధికారపక్షం కౌంటర్ ఎటాక్‌కు దిగడంతో... ఆధ్యాత్మక నగరి ఆందోళనలతో అట్టుడికింది. టీటీడీ కూడా ఇది తప్పుడు ప్రచారం.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వీడియోలు అసలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చింది.. అయితే, ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది.**
నాటకీయ పరిణామాలు
తిరుపతిలోని ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి ప్రజాప్రతినిధులు గోశాలను పరిశీలించారు. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులతో పాటు టీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు గురువారం ఉదయం గోశాల వద్దకు వెళ్లారు. ఎస్వీ గోశాలపై వైసీపీ నేతల ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు. వైసీపీ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు. అక్కడి నుంచే భూమన కరుణాకర్‌రెడ్డికి కూటమి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్, పులివర్తి నాని, మురళీ, నవాజ్‌బాషా ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని కూటమి ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డిని కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని, క్షేత్రస్థాయికి రావాలని సవాల్ విసిరారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని అన్నారు. ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తానని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతి గోశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.**
భూమనది ఒకమాట... ఎస్పీది మరో మాట**
గోశాలకు వెళ్లేందుకు సిద్ధమైన తనని పోలీసులు గృహ నిర్బంధం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు భూమనని తాము గృహ నిర్బంధం చేయలేదని తెలిపారు. గోశాలను సందర్శించేందుకు కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. ఒకే సమయంలో రెండు పార్టీల నేతల వస్తే ఉద్రిక్తత చోటు చేసుకుంటుందనే ఉద్దేశంతో కూటమి ప్రజాప్రతినిధులు వెళ్లాక భూమనని రావాలని సూచించినట్లు తెలిపారు. అయినా ఆయన వినకపోవడంతో ఇంటి వద్ద నిలువరించామన్నారు.