AP: వరదలతో ఏపీలో భారీగా పంట నష్టం

అందరినీ ఆదుకుంటామన్న చంద్రబాబు... కొనసాగుతున్న వరద కష్టాలు;

Update: 2024-07-27 04:30 GMT

ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సుమారు 40 లంక గ్రామాల్లో వేల ఇళ్ల చుట్టూ భారీగా నీళ్లు చేరాయి. ప్రజలు ఐదు రోజులుగా ముంపులోనే గడుపుతున్నారు. పి.గన్నవరం మండలం శివాయలంక, చినకందాలపాలెం, సఖినేటిపల్లి మండలంలోని అప్పనరామునిలంక, ఓఎన్జీసీ కాలనీ, కొత్తలంక, లాకుపేట, ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంకా ఆఫ్‌ ఠాణేలంక, లంకా ఆఫ్‌ గేదెల్లంక, కూనలంక, రాజోలులోని నున్నవారిబాడవలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర సరకులు, ఆహార పొట్లాలు అందించాలని బాధితులు కోరుతున్నారు.

కోనసీమ జిల్లాలో 3,388 ఎకరాల్లో వరి నారుమళ్లు మునిగిపోగా ఇందులో 762.95 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. అరటి 594.28 హెక్టార్లు, కూరగాయలు 945.80 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అరటి 460 హెక్టార్లలో, కూరగాయలు 348.65 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లాలో 992 హెక్టార్లలో వరినాట్లు నీట మునిగాయి.

కొనసాగుతున్న వరద

భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. నదిలో వరద ప్రవాహం హెచ్చుతగ్గులకు లోనవుతూ అంతుపట్టడం లేదు. కాటన్‌ బ్యారేజీ నుంచి దిగువకు 12.58 లక్షల క్యూసెక్కుల జలాలు వదులుతున్నారు. మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నందున మరో మూడు రోజుల పాటు వరద కొనసాగుతుందని, తెలంగాణలోని కాళేశ్వరం వద్దకు ఆ జలాలు చేరితే వాస్తవ పరిస్థితిని అంచనా వేయగలమని జలవనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 33.14 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా 11.04 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతోంది.

ఆదుకుంటాం: చంద్రబాబు

వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ, విపత్తుల శాఖల మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత శనివారం వరద ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. రైతులు తమకు జరిగిన నష్టాన్ని వారికి వివరించాలని సూచించారు. తానే వెళ్లి వరద బాధితులను పరామర్శించాలనుకున్నా.. నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొనడానికి దిల్లీ వెళ్లాల్సి ఉండటంతో కుదరడం లేదని సీఎం చెప్పారు.

Tags:    

Similar News