తాను బీజేపీలోకి వెళ్తున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ కేశినేని నాని ఖండించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది జూన్‌లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్స్ అవసరం లేదనే విషయాన్ని తాను నమ్ముతానని పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా విజయవాడ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటానని తెలిపారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమంకోసం నిరంతరం కృషి చేస్తాను. సమాజానికి నా సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదు. కానీ, విజయవాడలోని నా తోటి పౌరుల శ్రేయస్సు కోసం నా లోతైన అంకితభావంతో ముడిపడి ఉందని కేశినేని నాని పేర్కొన్నారు. నా రాజకీయ పునరాగమనానికి సంబంధించి వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని నేను అందరినీ కోరుతున్నాను. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి వారి శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే నా దృష్టి ఉంది. నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుతాను. అదే అభిరుచి, నిబద్ధతతో నా సేవను కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను అని కేశినేని నాని అన్నారు.