AP: ఏపీ సీఎం అదనపు కార్యదర్శింగా కార్తికేయ మిశ్రా
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న నీరభ్‌కుమార్ ప్రసాద్‌ను ఏపీ సర్వీసుకు పంపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీవోపీటీ.. కార్తికేయ మిశ్రాను ఏపీ క్యాడర్‌కు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన ఆయన.. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న పలువురు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయాల్సిందిగా కోరుతూ సీఎం లేఖ రాశారు. దీంతో ఇప్పటికే కేంద్ర సర్వీసుల నుంచి ఐఏఎస్ పీయుష్, ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్హా రిలీవ్ అయ్యారు. తాజాగా, కార్తికేయ మిశ్రా రిలీవ్ అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సీఎంవో కార్యాలయం సహా అన్ని విభాగాల్లోనూ సమర్థులైన అధికారులను నియమిస్తున్నారు.
ప్రారంభమైన పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మూడు నెలల బకాయితో కలిపి ఒకేసారి రూ.7 వేలు పెన్షన్ పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. పెన్షన్ల పంపిణీని పండుగలా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో భాగమవుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం.. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. పెనుమాకలోని సుగాలికాలనీకి చెందిన బాణావత్ పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు నుంచి తొలి పింఛన్ అందుకున్నది. పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్, ఆయన కుమార్తె ఇస్లావత్ శివకుమారికి వితంతు పింఛన్‌ను వారి ఇంటి వద్ద చంద్రబాబు స్వయంగా అందజేశారు. పింఛన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో పెనుమాక గ్రామం ముస్తాబయ్యింది.
త్వరలో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత రవాణ సదుపాయంపై ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు శుభవార్త చెబుతామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామన్న రామప్రసాదరెడ్డి... అవి చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి... గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.