మాజీ సీఎం జగన్‌పై మంత్రి నాదేండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. వర్క్ ఫ్రమ్ బెంగళూరులో ఉన్న జగన్ నెలకొకసారి బయటికి వచ్చి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పర్యటనల టైమ్‌లో పోలీసుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. జగన్ వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు జగన్ వల్ల ఎంత నష్టం, ఎలాంటి నష్టం జరుగుతుందో గమనించాలని మంత్రి కోరారు. అధికారంలో ఉండగా రోడ్లపై గుంతల్ని పూడ్చలేని జగన్.. ఇప్పుడు ఎన్నికల హామీలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
వైసీపీ హయాంలో లిక్కర్ నిషేధం చేస్తామని చెప్పి.. నకిలీ బ్రాండ్లతో అనేకమందిని పొట్టన బెట్టుకున్నారని నాదేండ్ల మండిపడ్డారు. జగన్ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్న మంత్రి.. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తమను విమర్శించడం ఆపి.. రైతుల కోసం జగన్ ఏం చేశాడో చెప్పాలన్నారు. దమ్ముంటే రైతుల అంశంపై జగన్ రావాలని నాదేండ్ల సవాల్ విసిరారు.
గత పాలనలో రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిల్ని ఎగ్గొట్టారని మంత్రి ఆరోపించారు. గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి నరకం చూపించారని అన్నారు. కూటమి సర్కార్ ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.12,857 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, రూ.12 వేల కోట్లను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేశామని వివరించారు.